"వేమన మాటలు వేదము సుమ్మీ
వేదము మించిన వాదము సుమ్మీ
వాదుల నోట్లో బూడిద సుమ్మీ" అని ప్రకటించిన కవి వేమన. ఈయనను అధిక్షేప కవి గా పేర్కొంటారు. కవి చౌడప్ప లాగా పచ్చి బూతులు తిట్టకున్నా, సమాజానికి చాలా చురకలే తగిలించాడు మన వేమన. అచల యోగాన్ని అనుభూతికి తెచ్చుకుంటూ, కనిపించిన ప్రతి సంఘటన మీద స్పందిస్తూ , ఆటవెలదులతో అందరినీ బాగానే ఆట పట్టించాడు వేమన. ఆయన మన రాయలసీమ లో అనేక గ్రామాల లో ఊరి వాకిళ్ల వద్దా, రచ్చ బండ ల మీద కూచుని ఎన్ని పద్యాలు చెప్పాడో కదా !!!!! మనకు ఆయనను చూసే అదృష్టం లేకున్నా, ఆయన పద్యాలు మనకబ్బాయి చూడు.. అవే పదివేలు. వేమనకు అంతా బట్ట బయలే.. చివరకు "బ్రహ్మం బు కూడా బట్ట బయలే". ఏం తిన్నాడో, ఎక్కడ ఉన్నాడో పాపం. సమాజం మీద మాత్రం చాలా కోపాన్నే ప్రదర్శించాడు. ఆయన పద్యాలు పోలీసు వాళ్ళ లాటీ దెబ్బల లాగా బయటకు కనిపించకున్నా సలుపుతూనే ఉంటాయి. శైవులను, వైష్ణవులను , శాక్తేయులనూ అందరినీ తిట్టాడు వేమన. ఆ తిట్ల వెనుక ఎంతో విజ్ఞత దాగుంది. ఆధిపత్య భావజాలం మీద ఆ కాలం లోనే పద్యం రూపంలో తిరుగుబాటు బావుటా ఎగరవేసిన మహానుభావుడు వేమన. ఈయన ఓ జన ప్రియ కవి. నాలుగు పాదాల లో నాలుగు వేదాల అర్థం, పరమార్థం ఇరికించిన సిద్ద యోగి వేమన. పరుసవేది కోసం ఆయన పడిన తపన ఆయన్నే బంగారుగా మార్చేసింది. అపరంజి కూడా ఆయన పద్యాల ముందు దిగదుడుపే. ఆ కాలం లోనే ఎక్కడ పట్టుకున్నాడో ఆ వెటకారాన్ని.. ఆ పద్యాల నిండా వెటకారమే .. చమత్కారమే. వేమన శతకం నేర్చుకుంటే చాలు, ఇక ఏ management schools లో చదవాల్సిన పనిలేదు. ప్రతి పద్యం లో ఏదో ఓ రూపంలో వ్యంగ్యం తొంగి చూస్తుంది. దాని వెనుక ఒక సంస్కరణ కోణం కూడా దాగిఉంది. జీవిత తొలి దశలో మహా భోగాలు అనుభవించిన వేమన ఎందుకు సంసార విముఖుడు అయ్యాడో తెలియదు. స్త్రీల పట్ల చిన్న చూపు లేదు గానీ, ఏదో నిరసన భావం అయితే ఉంది. స్త్రీల చూచినప్పుడు చిత్తం బు రంజిల్లు అనగలిగిన రసజ్ఞత కూడా ఉంది. బ్రాహ్మణ భావజాలం పట్ల విముఖత కూడా కనిపిస్తుంది. మూఢ భక్తి అంటే నచ్చని అద్వైత కవి వేమన.
"రాతి బసవని గని రంగుగా మొక్కుచూ
గునక బసవని చూచి గుద్ధు చుంద్రు
బసవ భక్తులె ల్ల పాపులు తలపోయ" అంటాడు శివ భక్తుడైన వేమన
పుత్తడి కలవాని పుష్టం బు పుండయితే
వసుధ లోన చాల వార్తకె క్కు
పేద వాని ఇంట పెండ్లైన నెరుగరు అన్న మానవతా వాది మన వేమన
పిండములు చేసి పితరుల తలబోసి
కాకుల కు బెట్టు గాడ్దెలారా
పియ్య తినెడు కాకి పితరుడె ట్లాయరా .. అని మూఢా చారాలను తూర్పార పట్టాడు.
తల్లి కన్న తల్లి, తన తల్లి ,పిన తల్లి
తాత కన్న తల్లి, తల్లి తల్లి
ఎల్ల శూద్రులైరి, యేటి బాపడు తాను .. అని ఎంత సరళంగా బ్రాహ్మణ ఆధిక్యత ను నిరసించాడో కదా!!!!!
"మరి విద్యార్థి మిత్రులారా మన కవిగా, ప్రజా కవిగా చెలరేగి పోయిన వేమన సమాధి సత్యసాయి జిల్లా కటారు పల్లె లో ఉంది. వెళ్ళి చూసి రండి. వేమన శతకాన్ని హృదయగతం చేసుకోండి. ఆ ఆట వెలది పద్యాలు వేలాది నాలుకల మీద నాట్యం ఆడాలి. పద్యం నేర్చుకోండి.. తెలుగును బతికించండి" అని పిల్లల జయ జయ ధ్వానాల మధ్య చక్కగా ముక్తాయించారు మా ప్రిన్సిపల్ జయరామ రెడ్డి గారు.
Labels: వేమన నా జీవ నాడి
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home