Tuesday, January 3, 2023























































 దేహం దేవాలయం లాంటిది. దీనిలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయాలి. లేదంటే దేహం కూలికెత్తుకున్న బండ లాగా బరువై పోతుంది. జీవన శైలుల లో వచ్చిన మార్పుల వలన చాలా మంది కొన్ని అసాధారణ వ్యాధులకు గురై, కాళ్ళు, చేతులు లాంటి వివిధ అవయవాలను కోల్పోతున్నారు. ఇలా అవయవాలను ఏదో ఒక కారణంగా కోల్పోతున్న వారి సంఖ్య దిన దినం పెరుగుతూ ఉంది. ఈ హై స్పీడ్ యుగం లో, గమనం మీదే తప్ప గమ్యం మీద ఏ మాత్రం ధ్యాస లేని యువత రహదారుల మీద రయ్యి మంటూ దూసుకు వెళ్ళి ప్రమాదాలకు గురై అవిటి వారిగా మిగిలిపోతున్నారు.  కొద్ది మంది పిల్లల లో సెరెబ్రల్ ప్లాసీ వలన కాళ్ళు, చేతులు స్వాధీనం లో ఉండవు. ఇక పోలియో వ్యాధి బారిన పడిన పిల్లల పరిస్థితి మనకు తెలిసిందే. కాలిపర్స్ లేనిది వీళ్ళు నడవడం కష్టం. షుగర్ వ్యాధి మూలంగా గాంగ్రీన్ ఏర్పడి కాళ్ళు, చేతులు కోల్పోతున్నవారు కొల్లలు కొల్లలు గా ఉన్నారు. రేషన్ షాప్ లో ఉండాల్సిన చెక్కెర అంతా శరీరం లోకి వస్తే అంతే మరి. మొన్న ఎప్పుడో మా కవి మిత్రుడు 'ఎలా ఉన్నావు?' అని నేను అడిగినందుకు 'శరీరం చెక్కర మిల్లు అయ్యింది మిత్రమా.. నన్ను కుట్టిన దోమ కూడా తేనె టీగ గా ఎగిరిపోతుంది' అనడం నాకో తీపి గుర్తు. ఇక ఈ మద్య చాలా మందికి వెరికోస్ వెయిన్స్ మరియు Deep Vein Thrombosis వలన కూడా కాళ్ళు తీసి వేయాల్సిన పరిస్థితి వస్తోంది. బోన్ టిబి లేదా కాన్సర్స్ వలన కూడా అవయవాలు తీసేయాల్సి రావొచ్చు. మరి వీరంతా నిరాశగా బతుకును భారంగా ఈడ్చ వలసిందేనా అన్న దానికి సమాధానమే మేము మా విద్యార్థులతో చేపట్టిన క్షేత్ర పర్యటన. మీకు తెలియంది ఏముంది .. మా ప్రిన్సిపల్ ముందుండి ఈ కార్యక్రమాన్ని నడిపించారు. శ్రీదేవి మేడమ్, మాసినేని సుధాకర్ మరియు నేను శివుడి వెనుక ప్రమద గణాల లా  మా ప్రిన్సిపల్ వెంట బయలుదేరాం. RDT ఆవరణ లో ఉన్న Prosthetics center కు చేరుకున్నాము. Prosthetics center  అంటే కృత్రిమ అవయవాలను తయారుచేసి అమర్చే కేంద్రం. మీకు జైపూర్ ఫుట్ తెలుసు కదా.. అది ఇప్పుడు మా అనంతపూర్ జిల్లాలో కల్యాణదుర్గం లో కూడా తయారు చేయబడుతోంది. పి. కె . సేథీ వీటిని రూపొందిస్తే మన మాజీ దివంగత రాష్ట్రపతి కలాం గారు వీటిని ఇంకా మెరుగుపరిచారు. వీటిని చాలా ధృడమైన మరియు తేలికపాటి పదార్థాలతో తయారు చేస్తున్నారు. కల్యాణదుర్గం లోని ఈ Prosthetics center లో వీటిని అతి తక్కువ ధరకే అందిస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ను ఉపయోగించి కొలతలు తీసుకుని, High density poly acrylic మరియు titanium లాంటి పదార్థాలతో వీటిని ఇప్పుడు మన కల్యాణదుర్గం లోనే తయారు చేస్తున్నారు. అమర్చిన తరువాత ఫిజియో థెరపీ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ శేఖర్  గారి ఆద్వర్యం లో జరుగుతున్నాయి. ఈ Prosthetics center  లో కృత్రిమ అవయవాలను అమర్చిన తరువాత కొంత మంది క్రీడాకారులు గా రాణించి ఆస్ట్రేలియా కు కూడా వెళ్ళడం విశేషం. సకలాంగులు చేయలేని పనులు కూడా వీరు ఆత్మ విశ్వాసం తో చేస్తున్నారు. వీరు తయారు చేస్తున్న Prosthetic పరికారాలు ఈ క్రింద పేర్కొంటున్నాను. 

Calipers
Crutches 
Splints 
Sandals
Walkers
Above knee appliances  
Below knee appliances 
Above elbow appliances 
Below elbow appliances 
Special seat
Standing board 
Adductor sprints 

నిజానికి ఈ రోజు మా విద్యార్థులకు నడత ప్రాధాన్యత తో పాటు నడక ప్రాధాన్యం కూడా తెలిసివచ్చింది. 
మీరు కూడా ఇక్కడ ఎవరికైనా కృత్రిమ అవయవాలు sponsor చేయవచ్చు.  కాళ్ళు పోయిన వారిని తిరిగి ఆత్మ స్థైర్యం తో  నిలబడేలా చేయవచ్చు. అవయవాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఎందుకు తలెత్తు తుందో గ్రామాలలో అవగాహన కల్పించవచ్చు.  ఇంత మంచి కార్యక్రమ సూత్రధారి మా మనసున్న మాసినేని సుధాకర్ కు మా నమోవాకాలు.  

Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home