Sunday, January 1, 2023











 ఇక్కడ మీరు చూస్తున్నది అనంతపురం జిల్లా రాయదుర్గం వద్ద ఉన్న వీరాపురం 75 గ్రామం లో ఉన్న రాతి మంచం. ఒకే శిలతో మలచబడిన ఏకశిలా మంచం ఇది .ఇలాంటి Monolithic cots భారత దేశ చరిత్ర లో రెండు మాత్రమే ఉన్నాయట. ఇది మొదటిది. అసలు దీని చరిత్ర ఏమిటి అని  చెప్పే వారు లేరు. 1999 సంవత్సరం నుంచి దీనిని చూడాలని ఎంతో ఉబలాటపడిన నాకు ఈ రోజు రాయదుర్గం డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపల్ అయిన జనార్ధన రెడ్డి వలన చూసే భాగ్యం అబ్బింది. ఆయన పూర్వ కళాశాల లో ఏదో కార్యక్రమం చూసుకుని , అ కళాశాల లో పనిచేస్తున్న మైక్రో బయాలజీ అధ్యాపకులు గోవర్ధన్ ని వెంటేసుకుని, మా అర్థ శాస్త్ర అధ్యాపకురాలితో పాటు ఆ అపురూపమైన ఏక శిలా మంచం చూడడానికి నా కారు లోనే బయలుదేరాము. ఆ వీరాపురం గ్రామం రాయదుర్గానికి కేవలం 5 కిలో మీటర్లు. చక్కటి రోడ్డు ఉంది. ఆ గ్రామం లో ఆ మంచం దగ్గరకు మమ్మల్ని పిలుచుకుపోవడానికి రాయదుర్గం కళాశాల డిగ్రీ విద్యార్థి అభి కాచుకుని ఉన్నాడు. గ్రామం లోని ఓ సందులో ప్రవేశించిన తరువాత కారు ఇక్కడ పెట్టేయండి సర్ అన్నాడు అభి. ఇక అక్కడ నుంచి తుప్పలు దాటుకుంటూ, ముళ్ళు .. రాళ్ళు దాటుకుంటూ.. వనచరాల లాగా ముందుకు సాగాము. అలా ఓ పది నిముషాలు ప్రయాణించిన తరువాత ఆ ఏక శిలా మంచం మా కళ్ళకు కనిపించింది. పురాతత్వ శాఖ వారికి ఈ  మంచం మీద ఏమైనా కినుకా.. ఎందుకో దానిని పట్టించుకోలేదు వాళ్ళు. సరే.. అది మనకెందుకు గానీ .. నాలుగు ఫోటోస్ తీసుకుని చరిత్ర విద్యార్థుల ప్రాజెక్టు కు పనికొచ్చే అంశాలు కూపీ లాగుదాం అనుకున్నాను. కానీ చెప్పే నాథుడే డి? రాయలసీమ లో కథలు చెప్పడానికి నోళ్ళు ఎందుకు.. రాళ్ళు చాలు కదా అని అనుకుని ఆ మంచం మీద నా చెవి ఆనించాను. నిజం చెప్పొద్దు మరి.. నాకు ఆ మంచం మీద చాలా ఊసులు వినపడ్డాయి. నిద్రా సుఖం.. శయ్యా సుఖం తెలిసిన శిల్పి మాత్రమే ఈ శిలా తూలిక ను మలచి ఉంటాడు.  అసలు ఈ మంచం ఏ రాచ వంశాన్ని పెంచి ఉంటుంది? చోళ వంశాన్నా!!!!!!లేక విజయ నగర రాజుల వంశాన్నా! అసలు దీని మీద నిద్రించే స్థలం ఉందా? లేక ఇది కేవలం ఔపచారిక మంచమా? అసలు దీని తత్వం జైనమా.. హైందవమా? ఎవరికైనా ఇది అవసరమే కదా. ఏ మతానికైనా మంచం అవసరమే కదా. అసలు సృష్టి మూల స్థానం మంచమే కదా. మంచం భోగికి ఉపకరణం.. రోగికి ఆధారం. ఆ రాతి మంచం మీద రాతి తలగడలు. పక్కలో నిద్రించే సమయం లో పడిపోకుండా రాతి దిమ్మెలు. ఎంతైనా రాజులు కదా.. అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మంచం క్రింద అచ్చెరువు గొలిపే చిత్తరువులు . ఆ రాతి మంచం మీద ఎవరి వో శిల్పాలు. ఎవరు వీళ్ళు? నిద్రా దేవతలా? "యా దేవీ సర్వ భూతేషు నిద్రా రూపేణ సంస్థితా" అని కదా అన్నారు. నిద్ర పట్టని వాళ్ళను అడగండి నిద్ర విలువ తెలుస్తుంది. అందుకే నిద్ర కూడా దేవతే మనకు. నేను మంచం మీద చెవి ఒగ్గి వినడం చూసి, మా జనార్ధన్ సర్ కూడా దానికి తల ఆంచాడు. దాని మీద పరుండిన ఏ రాణి మెత్తటి హృదయమో తగిలినట్టు ఉంది.. పరవశించి పోయాడు. వారి  గ్రామం మంచం కోసం వచ్చిన మమ్మల్ని చూసి అభి "సర్.. మాకు దీని విలువ తెలియదేమో మరి?' అన్నాడు. నిజమే ఇంత మంది రాజుల వారసత్వాన్ని, వారి సత్వాన్ని  భావి తరాలకు పంచిన ఆ మంచం చుట్టూ ఎవరో ఆకతాయిలు మల విసర్జన చేశారు. ఒకప్పుడు ఎంతో వైభవాన్ని చవి చూసిన ఈ మంచం ఇలా చెత్త కుప్పలలో పడి ఉండడం  మన దౌర్భాగ్యం. ఎవరైనా చరిత్ర అధ్యాపకులు దీని పుట్టు పూర్వోత్తరాల మీద పరిశోధన చేసి పుణ్యం కట్టుకోండి. 

Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home