Wednesday, June 28, 2023





 ఈ సమావేశం జరుగుతున్న ప్రాంగణం అనంతపురం లోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ. అంటే ITI. నీ కాలేజీ లో నీవు పాటాలు చెప్పుకోక, ఇక్కడ నీకేం పని అని మీరు అడగవచ్చు. చాలా విచిత్రంగా నాకు ఈ రోజు ఇక్కడ ఒక అవగాహనా సదస్సు లో పాల్గొనే అవకాశం వచ్చింది. నాకు ఈ ప్రాంగణం తో చాలా అనుబంధం ఉంది. ఇది రైల్వే ట్రాక్ కు ఆనుకుని ఉంటుంది. దీనిని చాలా చక్కగా ఇప్పుడు తీర్చిదిద్దారనుకోండి. చూసి నిజంగా ఆశ్చర్యపోయాను. చిన్నప్పుడు, సైకిల్ ఈ ప్రాంగణం లోనే నేర్చుకున్నాను. 'అంత చిన్నోడివి, అంత పెద్ద సైకిల్ ఎలా, ఆ వయసులో నేర్చుకున్నావు? 'అని అడకండి. నేను నేర్చుకున్నది కూడా చిన్న సైకిలే. అప్పట్లో ఒక రోజుకు దాని బాడుగ (కిరాయి లేదా అద్దె అనుకోండి  ) కేవలం రెండు రూపాయలు మాత్రమే. ఈ రోజు ఈ సదస్సులో పాల్గొంటూ ఉంటే ఆ జ్ఞాపకాలు స్టాండ్ వేసిన సైకిల్ చక్రం తిరిగినట్టు గిర్రున నా బుర్రలో తిరిగాయి. "నీ గతం సోది ఎవరికి కావాలి? నీవు అక్కడికి వెళ్ళి పొడిచింది ఏమిటి?" అని మీ  తరువాతి ప్రశ్న కదా!!!! నిజంగా అంత మంది పిల్లలు అమాయకంగా నేను చెప్పబోయేది వినడానికి కూచుని ఉంటే తెగ ముచ్చటేసింది. ఎవరు ఎవరి మాట వినని ఈ కాలంలో వీళ్ళు ఎంత అమాయకంగా కూచున్నారు అనిపించింది. ఎక్కువ మంది పదవ తరగతి ప్యాస్ అయిన వాళ్ళే. ఒకటీ, అరా ఇంటర్ పూర్తీ చేసుకున్నారు.  ఉన్నత చదువులు కొనసాగించడానికి ఆర్థికపరమైన వెసులుబాటు లేక ఇలా ఐ టి ఐ లో చేరిపోయారు. నిజానికి వీరిని ట్రైనీస్ అనాలి. విద్యార్థులు అనడానికి లేదు. వారు శిక్షణ పొందుతున్న కోర్సు లను trades అనాలి. మొదటిసారి శ్రమను గౌరవించే పిల్లలతో గడుపుతున్నాను అనిపించి సంతోషమేసింది. వీరికి కష్టం విలువ తెలుసు. మా కాలేజీ లో విద్యార్థులకు విజ్ఞానం ఉండవచ్చు. కానీ వీరికి నైపుణ్యం ఉంది. నైపుణ్యాన్ని మించిన వనరు ఏముంది ఈ కాలం లో. వీరిలో ఎలాగైనా స్పూర్తిని రగిలించాలి అనుకుని ఈ క్రింది సూచనలు ఇచ్చాను. 

- Skill India కు మీ అవసరం ఎంతో ఉంది. 

- మీకు నచ్చిన, వచ్చిన ట్రేడ్ లో నైపుణ్యాన్ని సంపాదించండి 

- మీ స్కిల్స్ కు ఆధునిక టెక్నికల్ సొబగులు అద్దండి 

- మార్కెట్ తీరు తెన్నులను గమనించండి. 

- ముందు, ముందు, డిగ్రీ కళాశాలలు అన్నీ ITI తో అనుసంధానం అవుతాయి.

- On Job Training సమయం లో వృత్తి పరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి. 

- డిజిటల్ స్కిల్స్ కూడా నేర్చుకోండి. 

- అమెరికా లాంటి చోట్ల ప్లంబింగ్, ఎలెక్ట్రికల్ పనులకు ఎంత డిమాండ్ ఉందో గుర్తించండి. 

- భారత దేశం లో కూడా మీ వృత్తి నైపుణ్యాలకు మంచి డిమాండ్ ఉంది. దీనిని డబ్బుగా మార్చుకునే నైపుణ్యం కూడా మీరు అలవరుచుకోవాలి. డబ్బు సంపాదించడం తో ఆగకండి. డబ్బును సంపదగా, సంపదను  ఐశ్వర్యం గా మార్చుకోగల సూత్రాలు నేర్చుకోండి. 

- అన్నిటికంటే మించి మీ స్కిల్స్ ను అప్డేట్ చేసుకోండి. విజయీభవ అంటూ ముగించాను. 

నాకు ఈ అవకాశం కల్పించిన ANSET విజయకుమార్ గారికి, శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు. 

కొసమెరుపు ఏమంటే, నేను మాట్లాడేటప్పుడు ఒక పిల్లవాడు ముసిముసి గా నవ్వుకుంటూ ఉన్నాడు. మొహం మీద కందెన మరకలు వాడికి. బహుశా మెకానికల్ ట్రేడ్ లో శిక్షణ పొందుతూ ఉన్నాడేమో వాడు. మొహం మీద  కందెన మరకలతో వాడు నవ్వుతూ ఉంటే, నిండు చందమామ పాండ్స్ పౌడర్ పూసుకుని పళ్లికిలిస్తున్నట్టు ఉంది. వాడు నన్ను ఆశీర్వదించినట్టు అనిపించింది. ఇది చాలు ఈ జీవితానికి అనుకుంటూ  సదస్సును ముగించాను. 

3 Comments:

At June 28, 2023 at 6:18 AM , Blogger meda said...

మీ ప్రేరణాత్మక సందేశం విన్న ఆ పిల్లలు ధన్యజీవులు సర్

 
At June 28, 2023 at 8:45 AM , Blogger Bhaskara Raju M said...

Excellent GLN, I too enjoyed every word of You.

 
At June 28, 2023 at 10:53 AM , Blogger Niranjan Mulaveesala said...

👏 inspiring sir

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home