ఈ రోజు కల్యాణదుర్గం కళాశాల మహదానంద వేదిక గా మారిపోయింది. పెడ దోవ పడుతున్న యువతను, కోరికల గుర్రాల నెక్కి కదం తొక్కుతున్న యువతను మంచి దోవలో పెట్టి, యవ్వన దశలో ఆరోగ్య స్పృహ ఎలా కలిగి వుండాలో తెలియజేసే కార్యక్రమం ఈ రోజు జరిగింది. స్త్రీ సాధికారత కమిటీ మరియు జంతుశాస్త్ర విభాగాలు సంయుక్తంగా చేపట్టిన ఈ సదస్సులో వైద్యులు హేమలత మరియు రూప పాల్గొని చిన్నా, పెద్దా అందరికీ ఆరోగ్య స్పృహ కల్పించారు. భౌతిక, మానసిక, పర్యావరణ, వృత్తిపర ఆరోగ్యాల గురించి బిషగ్వరులు చక్కగా తెలియజేశారు. యువత పదుగురు 'మెచ్చే పండు' లా ఉండాలని.. 'పుచ్చు పండు'లా ఉండకూడదని ఛలోక్తులతో, చతురో క్తులతో చక్కగా తెలియజేశారు. చరవాణుల చెర లో బందీలు గా మారిపోకండని చెప్పారు. ఈ మాట మా అధ్యాపకుల మనసులలో సైతం నాటు నాటు పాటలా నాటుకుపోయింది. చరవాణులను మీటి.. మీటి వేళ్ళు రోళ్ళ లాగా మారిపోయి చాలా మంది యువత ఈ వైద్యుల వద్దకు వస్తున్నారట. ( ఈ మాట వాళ్ళు చెప్పేటప్పుడు, నా వేలు ఎవరికీ కనపడకుండా దాచి పెట్టుకున్నాను). నేను కూడా ఇంస్టాగ్రామ్ వీడియో లు రోజుకో వంద వరకు చూస్తాను లెండి. కళ్ళు కూడా దెబ్బ తింటాయట. యువత ఎంత దృశ్య భ్రాంతికి లోనవుతోందో కదా!!! పులి మీద పుట్ర లాగా ఇప్పుడు అదేదో కృత్రిమ మేధ రాబోతుందట. ఇక యువత కళ్ళూ, కాళ్ళను చెకుముకి రాళ్ళు గా చేసుకుని మనసుకు మంట పెట్టేసుకోవడం ఖాయం. మరి ఇంత ఇంద్రియ చపలత్వం ఉన్న మన బుడ్డోళ్ల ని మంచి మార్గం లో పెట్టాలంటే వారికి అంతో.. ఇంతో.. ఏ కొంతో ఆరోగ్య స్పృహను కలుగజేయాలి. కాబట్టి యువతా !నీ భవిత చరవాణి రూపంలో నీ చేతిలోనే ఉంది. అది రెండు వైపులా పదునున్న వాడి కత్తి. జాగ్రత్త గా వాడుకో. ఆన్లైన్ పాటాలు వినడానికి మాత్రమే ఉపయోగించు అని చెప్పేశారు. ఇంకో మాట కూడా ఈ వైద్యులు చెప్పారు. OTT ద్వారా నీ నట్టింట్లోకి వచ్చే నానా చెత్తా చూసేయకురా అబ్బాయ్ అని కూడా చెప్పారు. బయటి ప్రేమ లకు లొంగకండి అని కూడా చెప్పారు. చూడడానికి బాగా కనపడడం ఆరోగ్యం కాదట. శారీరిక, మానసిక, భావోద్వేగ పరంగా బాగుంటేనే ఆరోగ్యమట. డాక్టర్ లు హేమలత మరియు రూప మా విద్యార్థులకు చేసిన సూచన లను ఈ క్రింద ఇస్తున్నాను
- చరవాణులు అవసరానికి మించి వాడకండి
- ఆరోగ్య కరమైన ఆహారాన్ని తీసుకోండి.
- ఇంటి వంట తినండి.
-చిరు తిండ్లు మానండి
- శారీరిక వ్యాయామం చేయండి
- నడక, నడత ఈ రెండూ ముఖ్యమే ఎవరికైనా
- ఇంటి వారితో ఆరోగ్యకరమైన అనుబంధాన్ని కలిగి ఉండండి ( ఇదేదో మాకు వర్తించేలా ఉంది)
- ఏకాగ్రత ను సాధన చేయండి
- కొద్దిగా ధ్యానం చేయండి
- ఉదయాన్నే లేవండి
- చెడు అలవాట్లు కలిగిన వారితో తిరిగితే పెగ్గులు.. హగ్గులు అలవాటవుతాయి. అదేదో Peer Pressure అంటారట దాన్ని.
- ధూమ పానం, మద్యపానం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి
వాళ్ళు చెపుతుంటే, మా పిల్లలు ఎంత చక్కగా విన్నారని. నడత నేర్పే ఇలాంటి కార్యక్రమాలు అడపా దడపా జరపడం మా ప్రిన్సిపల్ జయరామ రెడ్డి కి మాత్రమే సాధ్యం.
కొసమెరుపు ఏమంటే వచ్చే వారం మా విద్యార్థులకు CPR లో శిక్షణ ఇస్తామని వాగ్దానం చేసి వెళ్లారు డాక్టర్ హేమలత గారు.
అందరికీ ధన్య వాదాలు
ఇంకో కార్యక్రమం ఊసులు మరోసారి పంచుకుందాం.
- G L N Prasad
Labels: Adolescence Health
1 Comments:
అద్భుతం సర్ , చాలా మంచి కార్యక్రమం
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home