జీవితాన్ని తరచి చూడడమో, తడిమి చూడడమో చేస్తే రోజుకో కొత్త అనుభవాన్ని నీకు పరిచయం చేస్తుందని మా సీనియర్ మిత్రులు సూర్యనాగి రెడ్డి గారు అంటూనే ఉంటారు. ఈరోజు కాకతాళీయంగా ఆయన తో కలిసి నిమ్మలకుంట గ్రామం లో తొలుబొమ్మల కళాకారులను కలవడానికి వెళ్ళాము. వారిలో పద్మ శ్రీ అవార్డు గ్రహీత శ్రీ దళవాయి చలపతి గారు ఉన్నారు. ఆయనను కలిసి తోలుబొమ్మల తయారీ, ఆ తోలుబొమ్మలాట ప్రదర్శన గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. కళను నమ్ముకున్న వారిని కళామ తల్లి ఎప్పటికీ మోసం చేయదు. ఈ గ్రామం లో సుమారు 200 మంది నిష్ణాతులైన కళాకారులు ఉన్నారు. అందరూ మరాటీ భాష ను మాట్లాడతారు. చాలా కాలం క్రింద నే మహారాష్ట్ర నుంచి వీరి పూర్వీకులు వలస వచ్చారట.
తోలుబొమ్మల ను మేక తోలుతో తయారు చేస్తారు. దానికి చిత్రాలు వేసి రంగులు అద్దుతారు. రామాయణం లోని హనుమంతుడు, రాముడు, రావణాసురుడు లాంటి పాత్రలను తోలు బొమ్మలుగా మలచిన తీరు అనితరసాధ్యం. నా చిన్నప్పుడు ఓ పాట విన్నాను. "తక ధిమి.. తక ధిమి తోల్ బొమ్మా .. దీని తమాషా చూడవే మాయ బొమ్మ". వీటి పక్కన నేను నిలబడితే నేనూ ఓ తోలు బొమ్మే కదా అనిపించింది. తోలు తిత్తి ఇది.. తూట్లు తొమ్మిది , తుస్సు మనుట ఖాయం.. ఓ జీవా తెలుసుకో అపాయం" అని కూడా అనిపించింది. ఈ తోలు బొమ్మ నుంచి జీవుడు తుర్రు మనేటంతలొ మనం చాలా చేసేయాలి మరి. లేదంటే తోలు బొమ్మల్లో ఒకటైన కేతి గాడికి, మనకు తేడా ఏముంది? స్త్రీలందరూ కూడా చక.. చక ఆ తోలు మీద చిత్రాలు వేస్తుంటే నేనూ, మా సీనియర్ మిత్రుడు అవాక్కై అలాగే కొయ్య బొమ్మల్లాగా చాలా సేపు ఉండిపోయాం. కామెల్ రంగులు అద్దుతున్నారు వారు. ఈ 5 G యుగం లో కూడా వీరంతా ఈ తోలు బొమ్మల కళ నే నమ్ముకున్నారంటే, వీరంతా గొప్పవారు. అందుకే ఈ కళను ఇప్పటికీ సమాజం లో సజీవంగా ఉంచినందుకు గాను, శ్రీ దళవాయి చలపతి గారికి ఇటీవలనే పద్మ శ్రీ అవార్డ్ కూడా ఇచ్చారు. ఆయన వలన నిమ్మలకుంట గ్రామానికి దేశ వ్యాప్తంగా ఖ్యాతి వచ్చింది. ఇంత మహోన్నత కళాకారులు కూడా చాలా సాదా సీదాగా జీవిస్తుండడం విశేషం. వీరందరూ ఇప్పుడు ఆర్ట్స్ గాలరీ లలో ఆర్ట్స్ ఎక్సిబిషన్ లు పెడుతున్నారు. వీరిని దర్శించే అవకాశం, కలిసి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చిన సూర్య నాగిరెడ్డి గారికి, మా ప్రిన్సిపల్ జయరామ రెడ్డి గారికి ధన్యవాదాలు. మరో విషయం ఏమంటే ఈ మొత్తం కార్యక్రమం ఇంత పకడ్బందీ గా జరగడానికి అసలైన కారణం మా ఉపాధ్యాయ మిత్రులు ఆనంద భాస్కర్ రెడ్డి మరియు రంగయ్య.
1 Comments:
Super sir
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home