Sunday, May 7, 2023

 



పిల్లలు ఏవైనా అబద్దాలు చెపుతున్నట్టు అనిపిస్తే " ఏరా! కథలు చెపుతున్నావా ఏంది రోయ్?" అని మనం దబాయిస్తాం. ఇక మన విద్యార్థులైతే మనకు ఎన్ని కథలు చెపుతారో.కదా! ఏరా ఆలస్యం అయింది అంటే చాలు .. ఒక్కొక్కడు ఒక్కో కథ వినిపిస్తాడు. మన విద్యార్థులతో స్క్రిప్ట్ రాయిస్తే ఒక పది బాహుబలులు తీయొచ్చు. దీని అర్థం మన విద్యార్థులలో సృజనాత్మకత బోలెడంత ఉంది అని. కాబట్టి దీనిని నిజంగా కథలు రాసే వైపు మళ్ళిస్తే బాగుంటుంది అనే ఆలోచనతో నే , మా ప్రిన్సిపల్ డాక్టర్ జయరామ రెడ్డి , హిందూపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రగతి గారిని కథా సాహిత్యం మీద ప్రసంగించమని 25 ఏప్రిల్ 2023 న ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి చెందిన చిత్తరువులే ఇవి. ఆమె మాటల్లోనే కథ ఎలా రాయాలో తెలుసుకుందాము. 

- భాష మీద పట్టు సంపాదించుకోవాలి. మాండలిక భాష లు, దాని యాసలు తెలిసిఉండాలి. 

- పాత్రోచిత సంభాషణ ఎలా ఉండాలో తెలుసుకుని ఉండాలి. ఏ పాత్ర ఏ పలుకుబడి ని  

   ఉపయోగిస్తే సహజత్వం ఉంటుందో తెలియాలి 

- కథా వస్తువులను సమాజం నుంచే తీసుకోవాలి. 

- పాత్ర ను చిత్రీకరించేటప్పుడు, దాని వృత్తిని, ప్రవృత్తి నీ బట్టే సంభాషణ ఉండాలి 

- కథలో సామాజిక స్పృహ ఉండాలి 

- తెలిసిన  అంశాల  గురించి మాత్రమే రాయాలి. 

- అభూత కల్పనలను కథలో చొప్పించకూడదు 

- మూఢ నమ్మకాలను ప్రోత్సహించేదిగా కథ ఉండకూడదు. 

- కథా గమనం లో ఎక్కడా ఉత్సాహం తగ్గే అంశాలు జోడించకూడదు. 

- వ్యాసం లాగా కథను రాయకూడదు. 

ఇలాంటి విషయాలు చెపుతూనే, తను రాసిన కథలను ప్రగతీ మేడమ్ ఉదాహరణలుగా ప్రస్తావించారు. మా కళాశాల గ్రంథాలయానికి ఆమె రాసిన కథల పుస్తకాలను బహుకరించారు. 

మా విద్యార్థులు కూడా వారి కలానికి పదను పెట్టి కథలు రాయడానికి ఉద్యుక్తులయ్యేలా కనిపించారు. ఒక విద్యార్థి నన్నే చూస్తున్నాడు. ఈ బడుద్ధాయిని చూస్తుంటే వీడు రాయ బోయే కథలో నన్నో పాత్ర లా ఇరికించే పనిలో ఉన్నట్టు అనిపిస్తోంది.  ఇక మన కథ వీడి చేతిలో ఏ మలుపు తిరుగుతుందో కదా!!!!. చూద్దాం.. ఏ కథయినా సుఖాంతం అయితే చాలు.. అదే పది వేలు. 

కథ కు, కవిత కు ఉన్న తేడా ను సినారె మాటల్లో తెలుసుకుని ఈ అంకాన్ని ముగిద్దాం. 

"కవిత్వం కప్పి చెపుతుంది.. కథ విప్పి చెపుతుంది" - సినారె 

మా విద్యార్థులు రేపటి నుంచి ఎన్ని కథలు చెపుతారో చూడాలి మరి. 

                                                                                            - G L N ప్రసాద్ 

Labels:

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home