"పుష్పా అంటే ఫ్లవర్ అనుకున్నావా ఏంది ? కాదు ఫైర్" అనే డైలాగ్ వల్లే నిప్పు గొప్పతనం మనందరికీ తెలిసివచ్చింది. అదేదో సినిమాలో బ్రహ్మీ చెప్పిన ఫైర్ డైలాగ్ మనం గుర్తు చేసుకుంటే నిప్పును నిప్పుతో ఆర్పలేము అనే ఇంగిత జ్ఞానం కూడా కలుగుతుంది. మనం వంట చేస్తూనో, దీపావళి టపాసులు కాలుస్తూనో నిప్పుతో చెలగాటమాడుతూ ఉంటాము. నీరు, నిప్పు, గాలి, నేల మరియు నింగి అనేవి పంచభూతాలు. వీటిని వాడుకునే తీరు తెలియకుంటే ప్రమాదాలు కోరి తెచ్చకున్నట్టే అంటున్నారు అగ్నిమాపక దళ సిబ్బంది. ఈ రోజు ఏప్రిల్ 17, 2023 న అగ్నిమాపక దళ వారోత్సవాలు మా కళాశాల లో జరిగాయి. అగ్ని ప్రమాదాలు వేసవి లో జరగడం సర్వసాధారణం. అందునా మనవి రాయలసీమ ఎండలు. మరి అగ్నిప్రమాదాలు నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ క్రింద ఇస్తున్నాను.
- చిన్న పిల్లలకు అగ్గిపెట్టలు, టపాసులు, లైటర్ లు ఇవ్వకండి
- తగలబడే అవకాశమున్న పదార్థాల ను ఇంటిలో ఉంచుకోకండి
- గాలి, వెలుతురు వచ్చేలా ఇంట్లో ఏర్పాటు చేసుకోండి
- నాణ్యమైన సిలిండర్ ట్యూబును వాడండి. బొక్కలు పడిన ట్యూబు వాడి జీవితానికి బొక్కెట్టు
కోకండి
- రెగ్యులేటర్ వాల్వ్ ను ఆఫ్ చేయడం మరవకండి.
- వేడి నూనె మీద నీళ్ళు చిలకరించకండి
- అగ్ని ప్రమాద సమయం లో లిఫ్ట్ ఉపయోగించకండి
- విద్యుత్ తీగలకు, పరికరాలకు నిప్పంటుకుంటే, నీళ్ళు పోయకండ్రా అయ్యా!
- ఎక్కువ రోజులు ఇల్లు వదిలి ఉండవలసి వస్తే, ఎలెక్ట్రిక్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి.
- గడ్డి వాములను ఇళ్లకు దూరంగా పెట్టుకోండి
- విద్యుత్ తీగలకు దగ్గరగా గడ్డి వాములను పెట్టకండి
- ప్రమాద నివారణకు తగినంత నీటిని నిల్వ పెట్టుకోండి
- వెల్డింగ్ పనులకు నిపుణులను ఉపయోగించండి. ఏదో skill development course లు చదివేసాము కదా అని మీరు వెల్డింగ్ పనులకు పూనుకోకండి.
- దీపావళికి టపాసులు కాల్చుకోండి అంతే గానీ చేతులు, మూతులు కాల్చుకోకండి.
- క్యాంపస్ లో చెత్తా చెదారం పోగు పడకుండా చూడండి.
పై సంగతులన్నీ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో సబ్ ఇన్స్పెక్టర్ నజీర్ గారు తెలియజేశారు. ఈ కార్యక్రమం మొత్తం వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకట శేషయ్య మరియు NSS Officer డాక్టర్ పి. ఎల్. కాంతారావ్ ఆద్వర్యం లో జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు జరగడం వలన చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకునే అగత్యం తప్పుతుంది.
- G L N PRASAD