Tuesday, November 29, 2022



































 ఈ రోజు, అనగా నవంబర్ 29, 2022 మా కల్యాణదుర్గం ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైభవం విజయనగర సామ్రాజ్యాన్ని తలపించింది. మరో వినూత్న కార్యక్రమాన్ని ప్రిన్సిపాల్ జయరామ రెడ్డి నిర్వహించారు. సంగీత అవధానానికి మా కళాశాల వేదిక అయ్యింది. అవధాని తో పాటు ఎనిమిది మంది పృచ్చకులు నవరసాలను ఒలికిస్తూ సభను రాగ రంజితం చేశారు. రాగం, తానం , పల్లవిగా సభ సాగిపోయింది. తేట తెనుగు పద్యాలను హృద్యంగా అవధాని ఆలపించిన తీరు చూసి మా కళాశాల లో చదువుల తల్లి మురిసి పోయింది. విద్యార్థులంతా రసజ్ఞులైన శ్రోతలై పోయారు. పరవశించిన ఫణుల లాగా తలలను ఊపారు. ఆ వేదిక మీద సరస్వతి ఎన్ని పోకడలు పోయింది. హరికథలు, బుర్ర కథలు, యక్ష గానాలు, వీధి భాగవతాలు లాంటి ప్రక్రియలు ఎంత బాగా పరిచయం చేశారని మా సంగీతావధాని ఎలమర్తి మధు సూదన. ప్రతి పలుకులో మధువు ను చిందారు మధు సూదన. సుమారు మూడు గంటల పాటు జరిగిన ఈ సంగీత సాహిత్య సదస్సులో రసాస్వాదన చేస్తూ ముగ్ధ మోహనంగా చిరు నవ్వులు చిందిస్తూప్రిన్సిపల్  జయరామ రెడ్డి గడిపేశారు. శిశుర్వేత్తి .. పశుర్వేత్తి , వేత్తి గాన రసం ఫణి: అన్నారు కదా. మేమంతా శిశు ప్రాయులమై పోయాము అంటే నమ్మండి. బహు పరాక్ .. బహు పరాక్ అంటూ పృచ్చకులు చెలరేగిపోయారు. సంగీత మపి సాహిత్యం, సరస్వత్యా స్తన ద్వయం, ఏక మాపాత మధురం, అన్యత్ ఆలోచనా మృతం అనే భావన మా విద్యార్థులకు అనుభూతిలోకి వచ్చింది. మ్యూజిక్ లో ఎంత మాజిక్ ఉందో అర్థమయ్యింది. మా విద్యార్థులకు ఇప్పుడు భాష మీద, భావోద్వేగాల మీద మంచి పట్టే దొరికింది. తిల్లు పాటల నుంచి తిల్లానా వరకు వీరికి పరిచయ మయ్యింది. 'రా.. రా.. స్వామి'.. అంటూ ఉత్సాహపరుస్తూనే ..'అంతర్యామి, అలసితి.. సొలసితి..' అనే వైరాగ్య భావనను కూడా సూత్ర ప్రాయంగా అవధాని మా విద్యార్థులకు అనుభూతిలోకి తెచ్చారు. ఈ కార్యక్రమం లో ఈ క్రింది వారు పృచ్ఛకులుగా పాల్గొన్నారు. 

1. ప్రిన్సిపల్ జయరామ రెడ్డి : అధ్యక్షులు 

2. జాగర్లమూడి శ్యామ సుందర శాస్త్రి: సమన్వయకర్త 

3. పరమేశ్ : ఇష్ట దేవతా స్తుతి ని కళ్యాణీ రాగం లో ఆలపించమనడం తో సభ ఒక స్థాయీ భావాన్ని చేరింది 

4. అంజిన రెడ్డి అన్నమయ్య కృతి నిచ్చి, బాణీ ని మార్చమన్నారు. ఈ సమస్య తో నిజానికి అవధాని మరో అన్నమయ్యే అయిపోయారు. అవధాని వారిది కూడా అన్నమయ్య లాగే కడప జిల్లా నే ఆయే. 

5. జి. ఎల్. ఎన్. ప్రసాద్ 'ఏ తీరుగ నను దయ చూచెదెవో' అనే రామదాసు కీర్తన ను ఇచ్చి, జానపద బాణీ లో పాడ మనడంతో, ఆది తాళం లో ఉన్న ఆ కృతి ని ఖండ తాళం లో అవధాని మార్చి పాడారు. ఆ  పాడిన తీరుకు మా కళ్ళు చమర్చాయి. 

6. శేషయ్య 'ఇది కథ కాదు' సినిమా లోని 'తక థక ధిమి .. తక థక దిమి.. తక థక దిమి.. ధిం.. ధిం...ఈ లోకం ఒక ఆట స్థలము, ఈ ఆట ఆడేది క్షణము.." అనే పాటను బాణీ మార్చి బుర్ర కథ రూపంలో పాడమనడంతో, అవధాని వారు తందానా .. దేవనందనా న .. అని ఎత్తుకున్నారు. బుర్ర కథ లో లాగే మా విద్యార్థులు అవధానికి వంత పాడారండోయ్. 

7. ఇక విద్యార్థిని సౌమ్య 'కారే రాజులు.. రాజ్యములు గల్గవే 'పద్యాన్ని హృద్యంగా ఆలపించి దానిని హరికథ బాణీ లో చెప్పమనడం తో మధు సూదన అవధాని హరిదాసుగా మారారు. తోహ్రా.. మంజరీ లను కలుపుతూ.. ఆ శార్ధూల విక్రీడితాన్ని హరికథ బాణీ లో కొత్త పుంతలు తొక్కించారు. విద్యార్థులు శ్రీ మద్రమా రమా రమణ గోవిందా.. హరి అని చిందులేశారు. అది వినినట్టుంది మా సరస్వతి పంతులమ్మ .. చిరునవ్వులు రువ్వుతూ మురిసిపోయింది. 

8. ఇక మరో విద్యార్థి అజయ్ సినిమా పాటను ఇచ్చి బాణీ మార్చి పాడమన్నారు. ఈ విద్యార్థి ఓ  చిచ్చర పిడుగులా ఉన్నాడు. RRR సినిమా లోని 'కొమరం భీముడో.. కొమరం భీముడో.. కొర్రా సు నెగడోలే మండాలి కొడుకో' అనే పాటను అవధాని కిచ్చి, మీ కిష్టమైన బాణీ లో చెలరేగి పొమ్మనడం తో అవధాని మరో కీరవాణి అయ్యారంటే నమ్మండి.  

9. కంప్యూటరు అధ్యాపకుడు మాసినేని సుధాకర్ సుమతీ శతకం లోని వినదగు ఎవ్వరు చెప్పిన అనే పద్యాన్ని ఇచ్చి వీధి భాగవత పద్దతి లో పాడ మన్నారు. ఎంత బాగా పాడారని అవధాని!!!!!

10 హిందీ లెక్చరర్ అఖిల మందార మకరంద పద్యాన్ని ఇచ్చి యక్ష గాన రీతి లో ఆలపించమనడం .. దానిని అవధాని రక్తి కట్టించడం క్షణాలలో జరిగిపోయాయి. 

ఇంత పసందైన సభ మంచి విందు తో ముగిసింది. ఈ విందు కు రాజనీతి శాస్త్ర అధ్యాపకుడు మురళి ప్రాయోజకులు గా ఉన్నారు. వారి పుత్రిక హిమ వర్షిణి మొదటి జన్మ దిన సందర్బంగా ఈ విందు ను వారు ఇచ్చారు. ఆ హిమ వర్షిణి ని, అమృత వర్షిణీ రాగం లో మనసులోనే అందరూ ఆశీర్వదించారు. 

Labels:

1 Comments:

At December 1, 2022 at 4:43 PM , Blogger Dr. Rao S Vummethala said...

చాలా గొప్పగా ఉందండీ.👏👌🌷🙏

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home